Sathupalli | 12 మంది ముఠా అరెస్ట్..

Sathupalli | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉండటం సంచలనంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల నుంచి రూ.17.60 లక్షల నగదు, మూడు కార్లు, ఒక స్కూటీ, 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పోలీసుల యూనిఫామ్‌లు, బేడీలు, దొంగ నోట్లు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

ప్రాథమిక విచారణలో, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిస్తామని నమ్మించి పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై కూడా ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : అసలుకు డబల్ కరెన్సీ పేరుతో సాగిన ఒక ఘరానా మోసాన్ని సత్తుపల్లి పోలీసులు చేదించారు.. ఈ సందర్భంగా ఏసిపి వసుంధర యాదవ్ గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఘటనలో అరెస్టు చేసిన నిందితులు, స్వాధీన పరుచుకున్న నగదు, ఇతర వస్తువుల వివరాలు వివరించారు.

కేసుకు సంబంధించిన వివరాలు..

కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏసీపీ కథనం మేరకు ఈ విధంగా ఉన్నాయి .. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కలిదిండి మండలం, వెంకటాపురం కు చెందిన ఈదా చంటి చంటిబాబు, కడప జిల్లా, పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డికి ఫోన్ చేసి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని, తన ఖాతాలో రెండు కోట్ల బ్లాక్ మనీ ఉందని, తనకు ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం ఉందని నమ్మించాడు.. తన వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చాలనుకుంటున్నానని, ఎవరైనా వైట్ మనీ ఇస్తే దానికి నాలుగు రెట్ల అధికంగా బ్లాక్ మనీ ఇస్తానని తెలిపాడు.. అతని మాటలు నమ్మిన గంగాధర్ రెడ్డి.. అతను సూచించిన ప్రదేశానికి రూ. 10 లక్షల వైట్ మనీతో వెళ్లాడు..

ఈ నేపథ్యంలో గంగాధర్ రెడ్డి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్న చంటిబాబు డమ్మీ కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగు గంగాధర్ రెడ్డికి ఇచ్చాడు.. అవి లెక్క చూసుకుంటున్న సమయంలో ముందుగా ఏర్పాటు చేసుకున్న పథకం ప్రకారం చంటిబాబు మనుషులు మూడు కార్లతో వచ్చి దొంగ నోట్ల వ్యాపారం చేస్తున్నారంటూ అతనితో పాటు అనుమానం రాకుండా ఉండేందుకు వాళ్ల మనిషిని కూడా ఒకర్ని కొట్టి రూ. వైట్ మనీ రూ.10 లక్షలతో పాటు డమ్మీ నోట్లు కూడా లాక్కొని వెళ్లారు.. నిందితుడు చంటిబాబు పథకం ప్రకారం కార్లలో వచ్చిన వాళ్లలో ఇద్దరు పోలీస్ యూనిఫామ్ ధరించి ఉన్నారు.. ఎస్సై యూనిఫాంలో ఒకరు. ఆర్ఎస్ఐ యూనిఫాంలో ఒకరు వచ్చారు, వాళ్ల వాహనాల్లో హ్యాండ్ కప్ కూడా లభించింది.. బాధితుడు కుర్రా గంగాధర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సత్తుపల్లి ఏసిపి వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో సీఐ శ్రీహరి, ముగ్గురు ఎస్ఐలు దర్యాప్తు జరిపి నిందితులతో పాటు పైన పేర్కొన్న సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు..

స్వాధీన పరుచుకున్న సామాగ్రి ఇతర వస్తువులు..

ఈ ఘటనలో పోలీసులు రూ.17.60 లక్షల నగదు. రెండు ఇన్నోవా కార్లు, ఒక వెర్టిగా వాహనం, ఒక టీవీఎస్ స్కూటీ, 16 సెల్ ఫోన్లు, రెండు పోలీస్ యూనిఫామ్స్, హ్యాండ్ కఫ్ ఒకటి, ఎస్ఐ యూనిఫామ్ సెట్ ఒకటి, ఆర్ఎస్ఐ యూనిఫామ్ సెట్ ఒకటి, పోలీస్ నేమ్ వైట్ టీషర్ట్స్ రెండు, పోలీస్ రైన్ కోట్స్ 2, రూ.500 డమ్మీ నోట్లతో కూడిన 80 బండిల్స్ తో పాటు 13మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసిపి తెలిపారు

ఈ వృత్తిని హాబీగా మార్చుకున్న చంటిబాబు..

ఈ వృత్తిని హాబీగా మార్చుకున్న చంటిబాబు వేర్వేరు సిమ్ లతో ఫోన్ చేస్తూ ఒకోక్కసారి ఒకొక్క పేరుతో అమాయకులను మోసం చేస్తుంటాడని పోలీస్ విచారణలో తేలినట్లు ఏసిపి తెలిపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు..

అరెస్టు చేసిన వారిలో..

ఈద చంటిబాబు ( ఏలూరు జిల్లా, వెంకటాపురం), ముళ్లగిరి వర్ధన్ (15వ బెటాలియన్ కానిస్టేబుల్, సత్తుపల్లి మండలం, తుంబూరు, తెలంగాణ) మువ్వ సత్యనారాయణ ( ఏలూరు జిల్లా,టి నరసాపురం ), బేరా కేశవరావు ( ఆర్ఎస్ఐ సత్తుపల్లి మండలం గంగారం 15వ బెటాలియన్, తెలంగాణ ), మారుమూడి మధు( చింతలపూడి మండలం, మల్లాయిగూడెం, ఆంధ్రప్రదేశ్ ), గోరంట్ల గౌతమ్ కుమార్ ( ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం, బీరాపల్లి, తెలంగాణ) కర్లపూడి నవీన్( ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి, సదాశివపురం ), నక్కా నాగరాజు ( ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, తుంబూరు ), సాగి సుబ్బరాజు( ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా, కొండగట్టుపల్లి ) కాపా శ్రీనివాస్ ( సికింద్రాబాద్, ఏ ఎస్ రావు నగర్ ), దుడుగురుప గణేష్ ( కర్నూల్ జిల్లా, శ్రీకృష్ణ నగర్ ) ఉపేంద్ర జనార్దన్ రాజు ( ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లా,, రాజేంద్రనగర్), రామాంజనేయులు, రాజు ( సిమ్ ప్రొవైడర్స్ ) ఉన్నట్లుగా ఏసిపి తెలిపారు… కార్యక్రమంలో సిఐ టి.శ్రీహరి, ఎస్ఐ వీరప్రసాద్, అశోక్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.