గ్రామీణాభివృద్ధికి ‘జీ-రాం-జీ’ పథకం అమలు చేయాలి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జీ-రాం-జీ’ (గ్రామీణ ఉపాధి) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులైన రూ.3,825.31 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం నిధులైన రూ.2,486.47 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

మొత్తం రూ.6,311.78 కోట్లతో గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, గ్రామీణ కూలీలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, సర్పంచులు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రజల సంక్షేమం, కూలీల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా తన వాటా నిధులు విడుదల చేసి పథకాన్ని అమలు చేయాలని డా. బూర నర్సయ్య గౌడ్ కోరారు.