పోగుళ్లపల్లిలో విషాదం.. ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కొత్తగూడ, ఆంధ్రప్రభ: మండలంలోని పోగుళ్లపల్లి గ్రామంలో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, పోగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి రాజేందర్, దేవకీ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లగా, వారి పెద్ద కుమార్తె పెండ్లి చందన (16) వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటూ పదో తరగతి పూర్తి చేసింది. ఇంటర్‌లో చేరేందుకు గురువారం స్వగ్రామానికి వచ్చిన చందన, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చందన చేతిలో ఓ లేఖ లభించడంతో ఆత్మహత్యకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేఖలోని వివరాలతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.