గ్రామాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం

  • వీబీజీ రామ్‌జీతో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ
  • ఉపాధి రోజులు 100 నుంచి 125కు పెంపు
  • ప్రతి గ్రామానికి రూ.2 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు
  • పని అడిగిన 15 రోజుల్లో ఉపాధి.. లేకపోతే నిరుద్యోగ భృతి
  • ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది నెలల్లో రూ.12 వేల కోట్ల వ్యయం
  • మామిడి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అండ
  • గ్రామాల అభివృద్ధి నిర్ణయం గ్రామ సభదే.. ఢిల్లీది కాదు
  • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామాలు బలోపేతమైతేనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ యోజన–మిషన్ గ్రామీణ్) జాతీయ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న పవిత్ర భూమి నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని, పని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించాలని ఆకాంక్షించారు. ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో అమలైన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో ఏడాదికి 100 రోజుల ఉపాధి మాత్రమే కల్పించేవారని, వీబీజీ రామ్‌జీ కింద దానిని 125 రోజులకు పెంచామని తెలిపారు. అదనంగా 25 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం మొదటి ఏడాదే కేంద్ర ప్రభుత్వం రూ.95,600 కోట్లను కేటాయించిందని, రాష్ట్రాల వాటాతో కలిపి రూ.1.51 లక్షల కోట్లకు పైగా వ్యయం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులన్నీ గ్రామీణ ఉపాధి, మౌలిక వసతులు, ఆస్తుల సృష్టికి వినియోగించబడతాయని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న 2.86 లక్షల గ్రామ పంచాయతీలకు ఐదేళ్లలో ప్రతి గ్రామానికి రూ.2 కోట్లకు పైగా నిధులు అందనున్నాయని తెలిపారు. గతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై రూ.2.13 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇప్పుడు వీబీజీ రామ్‌జీ కింద ఐదేళ్లలో రూ.7.5 లక్షల కోట్లకు పైగా వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు కేవలం ఉపాధి కల్పించడానికే కాకుండా గ్రామాల రూపురేఖలు మార్చే శాశ్వత ఆస్తుల నిర్మాణానికి ఉపయోగపడతాయని చెప్పారు. పని కోరిన ప్రతి కార్మికుడికి 15 రోజులలోపు ఉపాధి కల్పించడం ఈ పథకంలో చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు. ఒకవేళ ఆ గడువులోపు పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే కార్మికులకు వేతనాలు ఆలస్యమైతే ఏడు శాతం వడ్డీతో చెల్లించే నిబంధనను కూడా తీసుకొచ్చామని తెలిపారు. కార్మికుల చెమటకు తగిన గౌరవం, న్యాయం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ పథకంలో పనిచేసే గ్రామీణ సిబ్బంది, గ్రామ ఉపాధి సహాయకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని తెలిపారు. పరిపాలనా వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచి, ఇందుకోసం ఏటా రూ.13 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దీంతో ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలనే నిర్ణయం ఢిల్లీలోనో, అమరావతిలోనో కాదని, గ్రామ సభలోనే తీసుకోవాలని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, స్వయం సహాయక సంఘాల భవనాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల మౌలిక సదుపాయాలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు, వర్షపు నీటి సంరక్షణ పనులు, ప్రకృతి విపత్తుల నివారణకు రక్షణ గోడలు వంటి గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను ప్రజలే ఎంపిక చేసుకోవచ్చని వివరించారు.

వెనుకబడిన గ్రామ పంచాయతీలను ఏ, బీ, సీ గ్రేడ్లుగా వర్గీకరించి అత్యంత వెనుకబడిన గ్రామాలకు అధిక నిధులు కేటాయించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించినట్లు తెలిపారు. దీంతో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు వేగంగా నిధులు చేరి సమానాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే తొమ్మిది నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్ల నిధులు విడుదల చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి మొత్తం రూ.12 వేల కోట్ల మేర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని, గతంలో హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన నాయకత్వంలో అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి గ్రామీణాభివృద్ధికి దేశానికే ఆదర్శంగా నిలిచే నమూనాను ఆంధ్రప్రదేశ్ రూపొందిస్తుందని అన్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి పథకం అన్ని రాష్ట్రాల్లో అమలుకు మూడేళ్లు పట్టిందని, కానీ వీబీజీ రామ్‌జీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజున అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించడం మోదీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. తొలి రోజే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ఇకపై ఏ రాష్ట్రంలోనూ రోజువారీ కూలీ రూ.300 కంటే తక్కువ ఉండదని, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312 చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఐసీఏఆర్ శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రాఫ్టింగ్ ద్వారా అధిక విలువ కలిగిన మామిడి రకాలను సాగు చేసేలా రైతులకు సాంకేతిక సహాయం అందిస్తామని చెప్పారు. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2.16 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించారు. గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా 74 వేలకు పైగా గృహాలను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.422 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.