Telangana | పోలీసులతో తోపులాట.. కిందపడ్డ హరీష్ రావు

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై గన్‌పార్క్ వద్ద బహిరంగ చర్చకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) స్వీకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఆయనను పోలీసులు మధ్యలో అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు నిలిపివేయగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రులే చర్చకు రావాలని పిలిచారని, ఇప్పుడు పోలీసులు అడ్డుకోవడం సరికాదని హరీష్ రావు అన్నారు. మంత్రులు తమ కోసం అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) (Gunpark) వద్ద ఎదురుచూస్తున్నారని, అవసరమైతే వారికి ఫోన్ చేసి అడగాలని పోలీసులతో వాదించారు.

తాము ప్రజల తరఫున, దళితుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వెళ్తున్నామని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే గన్‌పార్క్ వద్ద కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ ముందుకు వెళ్లనివ్వలేదు.

దీంతో వాహనం దిగి కాలినడకన వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా, హరీష్ రావు కిందపడిపోయారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, అవినీతి అంశాలపై చర్చకు వెళ్తుంటే తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. చర్చకు ఆహ్వానించిన మంత్రులే పోలీసులకు చెప్పి తమను వెళ్లనివ్వాలని డిమాండ్ చేశారు.