భారీ జాబ్ అలర్ట్
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నియామకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 21, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియను నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష, అనంతరం మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేపట్టనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు 22, 23 తేదీల్లో, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, ఇతర అభ్యర్థులకు రూ.850గా నిర్ణయించారు. ఎంపికైన వారికి బ్యాంకు నిబంధనల ప్రకారం వేతనంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, వైద్య సదుపాయాలు, ఇతర భత్యాలు కూడా అందనున్నాయి.
దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, అవసరమైన ధ్రువపత్రాలు వంటి వివరాలను పరిశీలించాలని ఐబీపీఎస్ సూచించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలవనుంది.
అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in
