నిబద్దత, చిత్తశుద్ధి ఉన్న నేత తిరుమలేశ్వర్రావు…
ఎంపీ కేసినేని చిన్ని…
ఘనంగా తిరుమలేశ్వరరావు జయంతి..
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ : పార్టీ పట్ల నిబద్ధత చిత్తశుద్ధి అంకితభావం ఉన్న నేత తిరుమలేశ్వరరావు అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. నగర కార్పొరేషన్ చైర్మన్ స్వర్గీయ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కొత్తపేట ఎస్‌కేపీవి హిందూ హైస్కూల్‌లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎంపీ, పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, బోధన నాణ్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోందని పేర్కొన్నారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. విద్యే జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, అంకితభావంతో చదువుకొని కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. స్వర్గీయ మరుపిళ్ల తిరుమలేశ్వరరావు సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.
సమాజ సేవలో ఆయన చూపిన నిబద్ధత స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ తిరుమలేశ్వరరావు సోదరుడు అల్లాజీ, స్థానిక నాయకులు టీడీపీ జిల్లా పార్టీ కార్యదర్శి పిళ్లా శ్రీనివాసరావు, దాడి మురళి,యాగంటి రామారావు,రాజు సోలంగి, సుకాసి కిరణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
