ఓటు హక్కుపై కూటమి ప్రభుత్వం కుట్ర
ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలు యదేచ్చగా పాల్పడుతున్న కూటమి పార్టీలు..
దరఖాస్తులు ఇవ్వకుండానే యాప్‌లో నమోదు
బీఎల్‌వోలపై అధికార పార్టీ నేతల ఒత్తిడి..
ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘన..
లోటుపాట్లు సరిదిద్దకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తం..
వైసీపీ నేతలు దేవినేని, వెల్లంపల్లి, మల్లాది..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని, అర్హులైన ఓటర్ల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఓటర్లకు దరఖాస్తులు అందించకుండానే అందించినట్లు యాప్‌లో నమోదు చేస్తున్నారని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నెలకొన్న లోపాలను సరిదిద్దాలని కోరుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) లక్ష్మీనరసింహకు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.
అనంతరం దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణులు మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిబంధనల ప్రకారం సాగడం లేదన్నారు. బీఎల్‌వోలు దరఖాస్తులు పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్లు యాప్‌లో నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఒక బూత్‌లో వెయ్యి మంది ఓటర్లు ఉంటే కేవలం కొద్ది మందికే ఫారాలు ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు లక్ష్యాల కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని, అదే ఒత్తిడి కింద అధికారులు వాస్తవ పరిస్థితులను పక్కనబెట్టి గణాంకాలను నమోదు చేస్తున్నారని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు నేరుగా బీఎల్‌వోల పనిలో జోక్యం చేసుకుంటున్నారని, వారి ఇళ్లలో సమావేశాలు నిర్వహించడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బీఎల్‌వోలే దరఖాస్తులు పంపిణీ చేయాల్సి ఉండగా, అనేక చోట్ల ఆ విధానం పాటించడం లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌వోలు విధి నిర్వహణలో కూడా అందుబాటులో ఉండటం లేదని, ఈ పరిస్థితిపై కలెక్టర్ తక్షణమే సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షం స్పందిస్తే జిల్లా యంత్రాంగం కూడా స్పందించాలని, అధికార పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఎలాంటి లోటుపాట్లు సరిచేయకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
