108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం నిర్వహించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పులిమామిడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
పులిమామిడి గ్రామానికి చెందిన కుర్మక్కకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే మక్తల్‌కు చెందిన 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, పెద్దజట్రం గ్రామ సమీపంలో ప్రసవ వేదనలు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈఆర్‌సీపీ వైద్యుడు డాక్టర్ శివ సూచనల మేరకు 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లక్ష్మణ్ చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించగా, గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
అనంతరం నవజాత శిశువుకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, ఆక్సిజన్ అందిస్తూ తల్లీబిడ్డలను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన 108 అంబులెన్స్ పైలట్ శివశంకర్, ఈఎంటీ లక్ష్మణ్‌ను బాధిత కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు అభినందించారు.
