పేద ప్రజల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

చిలుపూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన ఆరుగురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.6,06,696 విలువైన చెక్కులు, 37 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.13,62,700 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.