‘రాజ్యాంగం మాట్లాడితే నాలుక కోస్తామంటారా?’..

కాళ్ల, ఆంధ్రప్రభ: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తే, “నాలుక కోస్తాం.. సమాధి కడతాం” వంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏలూరులో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై తన అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారని చెప్పారు. జడ శ్రవణ్ కుమార్‌పై ఏలూరులో మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం మతం మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు వర్తించవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను ప్రస్తావించినందుకు తనపై బెదిరింపు వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగంపై దాడితో సమానమని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే శాంతిభద్రతల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం దెబ్బతింటుందని విమర్శించారు.

Tags: Raghurama Krishnam Raju, Andhra Pradesh Politics