stock market | నష్టాలకు బ్రేక్.. లాభాల ట్రాక్‌పై మార్కెట్

stock market | నష్టాలకు బ్రేక్.. లాభాల ట్రాక్‌పై మార్కెట్

stock market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రెండు వరుస సెషన్లలో నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం సూచీలకు బలాన్నిస్తోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.71 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

మంగళవారం ముగింపు స్థాయి 76,478తో పోలిస్తే సెన్సెక్స్ బుధవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అనంతరం కొనుగోళ్ల జోరు కొనసాగడంతో ఉదయం 9:40 గంటల సమయానికి 282 పాయింట్లు పెరిగి 76,760 వద్ద ట్రేడవుతోంది.

అదే సమయంలో నిఫ్టీ కూడా లాభాల బాటలోనే కొనసాగుతోంది. ఉదయం 89 పాయింట్ల లాభంతో 23,954 వద్ద కదలాడుతోంది. బ్యాంకింగ్, వినియోగ వస్తువులు, సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లలో డాబర్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరోవైపు కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలాక్సీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్), ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రంగాల వారీగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 123 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. రెండు రోజుల అమ్మకాల ఒత్తిడి తర్వాత మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.