విజయవంతమైన బెజవాడ ఓపెన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్
- ఐజీఎంసీ స్టేడియంలో ముగిసిన రెండో బెజవాడ ఓపెన్ డబుల్స్ పోటీలు
- ఏపీ, తెలంగాణ నుంచి పాల్గొన్న టెన్నిస్ క్రీడాకారులు
- దివంగత ఎ. శ్రీనివాస్ స్మారకార్థం నిర్వహించిన టోర్నమెంట్‌కు విశేష స్పందన
- ఐదు వయో విభాగాల్లో హోరాహోరీ పోటీలు..
- విజేతలకు ట్రోఫీలు, బహుమతులు…
- రాష్ట్రంలో వెటరన్ టెన్నిస్‌కు మరింత ప్రోత్సాహం అందించాలన్న నిర్వాహకులు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించిన రెండో బెజవాడ ఓపెన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని వివిధ వయో విభాగాల్లో ప్రతిభ కనబరిచారు.
హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథులు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. గత ఏడాది అకాల మరణం చెందిన బెజవాడ ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన టెక్నీషియన్ దివంగత ఎ. శ్రీనివాస్ స్మారకార్థం ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను, క్రీడల పట్ల చూపిన అభిరుచిని నిర్వాహకులు, క్రీడాకారులు స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.
అమరావతి బెంచ్, గుంటూరులోని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్ట్రార్ కె. రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోటీలు విజయవంతంగా నిర్వహించారు. డా. రామకృష్ణ, ఎస్పీ కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి లలిత్, రాంబాబు తదితరులు నిర్వహణలో విశేషంగా సహకరించారు.
విభాగాల వారీగా విజేతలు:
70 ఏళ్లు పైబడిన విభాగం: కడపకు చెందిన అశోక్ రెడ్డి–వరప్రసాద్ జోడీ విజేతలుగా నిలిచింది. డా. చంద్రశేఖర్–ధనంజయులు (శ్రీకాళహస్తి) జోడీ రన్నరప్‌గా నిలిచింది.
60 ఏళ్లు పైబడిన విభాగం: హైదరాబాద్‌కు చెందిన మెహర్ ప్రకాష్–అరుణ్ కుమార్ జోడీ టైటిల్ కైవసం చేసుకోగా, అనంతపురానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి–శంకర్ రెడ్డి ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
50 ఏళ్లు పైబడిన విభాగం: విశాఖపట్నానికి చెందిన ఎం.వి.ఎల్.ఎన్. రాజు–శివకుమార్ రాజు జోడీ విజేతలుగా నిలవగా, నరసాపురానికి చెందిన అప్పాజీ–హిందూపూర్‌కు చెందిన రెడ్డి నాగరాజు జోడీ రన్నరప్‌గా నిలిచింది.
40 ఏళ్లు పైబడిన విభాగం: హైదరాబాద్‌కు చెందిన కె.వి.ఎన్. మూర్తి–విజయానంద్ జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. గంజి వెంకటేశ్వర్లు–సంపత్ కుమార్ జోడీ రన్నరప్‌గా నిలిచింది.
30 ఏళ్లు పైబడిన విభాగం: విశాఖపట్నానికి చెందిన సుకూర్–శ్రీనివాస్ జోడీ విజేతగా నిలవగా, కావలికి చెందిన జగదీష్–మణికంఠ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం టోర్నమెంట్ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దివంగత ఎ. శ్రీనివాస్ స్మారకార్థం ఈ పోటీలను నిర్వహించడం ఆయన క్రీడాస్ఫూర్తికి ఘన నివాళిగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో బెజవాడ ఓపెన్ డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా, జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
