ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలి: ఎండి జాంగీర్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజల జీవనం రోజురోజుకు మరింత భారంగా మారుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జాంగీర్ విమర్శించారు. మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను పదేపదే పెంచడం వల్ల రవాణా ఖర్చులు అధికమై, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరుగుతున్న ధరల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల నియంత్రణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాటూరు బాలరాజు, బూర్గు కృష్ణారెడ్డి, ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, గంగదేవి సైదులు, కరుణాకర్, గడ్డం వెంకటేశం, తడక మోహన్, చింతల సుదర్శన్, బోయ యాదయ్య, ఆదిమూలం నందీశ్వర్, అంతటి అశోక్, పొట్ట శ్రీనివాస్, పల్లె మధుకృష్ణ, ఎలమంచి సంజీవ, బోదాసు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.