Ap-Cm-Orders : ఖనిజాలపై ఫోకస్ Andhra Prabha Top News
Ap-Cm-Orders : ఖనిజాలపై ఫోకస్ Andhra Prabha Top News
- తక్షణం మినరల్ మ్యాపింగ్
- నిజ నిల్వలను గుర్తిద్దాం
- ఖనిజాలకు విలువ పై ప్రత్యేక దృష్టి
- మినరల్ వెల్త్ మార్కెట్
- క్యాపిటలైజేషన్‌పై అధ్యయనం
- టెక్నాలజీతో ఇసుక కట్టుదిద్దం
- గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు నాయుడు
( ఆంధ్రప్రభ, అమరావతి)

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
Ap-Cm-Orders : ఖనిజంతోనే సంపద

బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని సీఎం వ్యాఖ్యానించారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్ కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏమేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేక పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని మిగతా బ్లాక్స్ పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలిచ్చారు.
