మిగులు బడ్జెట్‌తో వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు

  • గత పాలనపై సీఎం రేవంత్ విమర్శలు..
  • అప్పుల లెక్కలు బయటపెట్టిన సీఎం
  • 60 ఏళ్ల కంటే 9 ఏళ్లలోనే ఎక్కువ అప్పు… రేవంత్ విమర్శలు
  • రైతు భరోసా వేదికగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు
  • వ్యవసాయాన్ని పండుగగా మారుస్తాం.. అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెడతాం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఎన్నికల హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేసింది రేవంత్ స‌ర్కారు. వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ఈ నిధులు రైతులకు అందనున్నాయి.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అప్పుల పరిస్థితి, రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 7, 2023న ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, రైతును ఆత్మగౌరవంతో నిలబెట్టే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ చెప్పిన‌ట్టుగా.. వ్యవసాయం అంటే దండగ కాదని, పండుగగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత 30 నెలల్లో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ.. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, నిజాం పాలన నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు దాదాపు 60 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రులు పాలన సాగించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంపై కేవలం రూ.69 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

అయితే, 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.69 వేల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం.. 2023 డిసెంబర్ 7 నాటికి రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో తమకు అప్పగించారని సీఎం ఆరోపించారు. “60 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.69 వేల కోట్లు మాత్రమే. కానీ కేవలం ఒకే కుటుంబం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను సోనిమ‌మ్మ‌, మ‌న్మోమ‌న్ సింగ్ అప్పగిస్తే.. తర్వాత అప్పుల ఊబిలో ముంచేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని, ఆర్థిక క్రమశిక్షణతో పాటు సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.