శ్రీ భూనీళాసమేత వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
- నేటి నుంచి ప్రారంభం
- నాలుగు రోజుల పాటు నిర్వహణ
- అమీనాపురంలో కొలువైన స్వామి
- ఆధ్యాత్మిక శోభను అలరించనున్న గ్రామం
కేసముద్రం, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమినాపురం గ్రామంలోని శ్రీ భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. ఆలయ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలను స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ విదియ (జూలై 1) నుంచి పంచమి (జూలై 4) వరకు శ్రీ శ్రీమాన్ ఆరుట్ల హేమంతాచార్యులు వారి యాజ్ఞిక బృందం ఆధ్వర్యంలో వేదోక్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు తమ వంతు కైంకర్యాన్ని ధనరూపంలో గానీ, వస్తురూపంలో గానీ సమర్పించి, గోత్రనామాలు నమోదు చేసుకుని ప్రత్యక్షంగా ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
కార్యక్రమాల వివరాలు…

జూలై 1 (బుధవారం):
ప్రాతఃకాల ఆరాధన, శాత్తుమొర, తిరుమంజన సేవ, అభిషేకం, ఉత్సవారంభ స్నపనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాస్వీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వైనతేయ పటాధివాసం, సోమహోమం, తత్వన్యాస హోమం, పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు.
జూలై 2 (గురువారం):
ఉదయం శాత్తుమొర, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, చతుస్థానార్చన, వేదవిన్నపాలు, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, బేరిపూజ, దేవతా ఆహ్వానం, ఎదుర్కోలు ఉత్సవం, వేదవిన్నపాలు, పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి నిర్వహించనున్నారు.
జూలై 3 (శుక్రవారం):

ఉదయం చతుస్థానార్చన అనంతరం ఉదయం 10 గంటలకు శ్రవణ నక్షత్రయుక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం తీర్థప్రసాద గోష్టి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు సేవ, అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, చతుస్థానార్చన, వేదవిన్నపాలు, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థప్రసాద గోష్టి జరుగుతాయి.
జూలై 4 (శనివారం):
ఉదయం చతుస్థానార్చన, మహాపూర్ణాహుతి, నవకలశ స్నపనం, చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగం, దేవతా ఉద్వాసనం, సప్తావరణం, ధ్వజావరోహణం, మహాకుంభప్రోక్షణ, ఋత్విక్ సన్మానం, మహదాశీర్వచనం, ఉత్సవ పరిసమాప్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థాన కమిటీ కోరింది.

విరాళాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
- వోలం మురళి – 9866654823
- బచ్చు పరమేశ్వర్ – 9948870814
- కోయగూరి యాకుబ్ రెడ్డి – 9440936071
- దేవస్థానం సెల్: 6300124732
