25 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర బృందం ప్రత్యేక సర్వే..

మరిపెడ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 5,500 ప్రభుత్వ పాఠశాలల్లో భాగంగా మరిపెడ మండలంలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పర్యవేక్షణ అధికారి జి. అరుణ మరిపెడ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో బోధనా విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల అభిప్రాయాలు, ఉపాధ్యాయుల ఫీడ్‌బ్యాక్, అలాగే స్థానిక సమాజ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ, విద్యా ప్రమాణాలు, కమ్యూనిటీ భాగస్వామ్యం వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు జి. అరుణ తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్‌లో కిచెన్ షెడ్ లేకపోవడంపై ఫిర్యాదులు అందాయని, వాటిని నివేదికలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. సర్వే నివేదిక ఆధారంగా అవసరమైన నిధులు మంజూరై, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవకాశం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల పనితీరు, వసతులు, విద్యా నాణ్యతపై సమగ్ర అంచనా వేసి, అవసరమైన అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహమ్మద్ అక్తరుజ్జమన్, వైస్ ప్రిన్సిపాల్ జానకి రాములు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.