రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..
వలిగొండ, ఆంధ్రప్రభ : తండ్రి మాసికం కోసం సరుకులు కొనేందుకు వెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన యదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో గుండెపోటుతో తండ్రి మృతి చెందాడు. సోమవారం తండ్రి శంకర్ మాసికం నిర్వహించేందుకు బీబీనగర్ మండలం బ్రాహ్మణ పెళ్లిలో ఉంటున్న తల్లి కృష్ణవేణి తో కలిసి స్వగ్రామం టేకుల సోమవారం కు వచ్చారు.
నెల మాసికం కార్యక్రమం కోసం అవసరమైన సరుకులు తెచ్చేందుకు కార్ మెకానిక్ అయిన బొల్లారం గణేష్ (25), సోమవారం సాయంత్రం మేనల్లుడు కేతరాజు భాను ప్రకాష్‌తో కలిసి TVS రైడర్ మోటార్ సైకిల్‌పై వలిగొండ కు వచ్చి సరుకులు కొనుక్కొని తిరిగి వస్తుండగా రాత్రి గంటల సమయంలో మందాపురం గ్రామ శివారులోని మలుపు వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో అదుపు తప్పి బైక్ ముందు చక్రం పడిపోయింది. అతివేగం కారణంగా అదుపు తప్పిన బైక్‌పై నుంచి గణేష్, భాను ప్రకాష్ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
ఈ ప్రమాదంలో గణేష్ తలకు, ఎడమ మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే కుటుంబ సభ్యులు గణేష్‌ను వలిగొండలోని రేణుకా దేవి ఆసుపత్రికి, అక్కడి నుంచి మెడిపల్లిలోని శ్రీకర్ ఆసుపత్రికితరలించారు. అప్పటికే గణేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం తల్లి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలిగొండ ఎస్ఐ వి. యుగేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
గ్రామంలో విషాదం..
రోడ్డు ప్రమాదంలో గణేష్ మృతి చెందడంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నెల రోజుల క్రితం తండ్రి శంకర్ గుండెపోటుతో మృతి చెందడం, తాజాగా కొడుకు గణేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి కృష్ణ వేణి రోదనలు అందర్నీ కంట తడి పెట్టించాయి. భర్తను, కొడుకును ఇద్దరిని కోల్పోయిన కృష్ణవేణి ఒంటరిదైంది. రోడ్డుపై ఉన్న గుంతలే ఈ ప్రమాదనికి కారణం అయిందని కుటుంబ సభ్యలు గ్రామస్థులు అధికారులపై మండి పడుతున్నారు.రోడ్లపై గుంతలను పూడ్చాలని ప్రజులు రోడ్లభవనాల శాక అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
