పాత కక్షలు, మొబైల్ ఫోన్ వివాదం…

  • వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన
  • నిందితుడిని అరెస్టు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో పాత కక్షలు, మొబైల్ ఫోన్ వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో నిందితుడిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల 28వ తేదీ రాత్రి బొక్కలగుట్ట గ్రామానికి చెందిన గజ్జి వెంకటేష్ @ స్వామి (40) సిమెంట్ రాయితో దాడికి గురై మృతి చెందాడు. మృతుని భార్య గజ్జి మమత @ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసు వివరాలను రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పరుష రమేష్ వెల్లడించారు. మందమర్రి శ్రీరామ కాలనీ కమాన్ సమీపంలోని కుర్మపల్లి ఫ్లైఓవర్ వద్ద నిందితుడు ఓడ్డేపల్లి రాజ్‌కుమార్ @ కుమార్ (28) ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో మృతుడు వెంకటేష్, నిందితుడి మేనకోడలితో అతని ఇష్టానికి వ్యతిరేకంగా గ్రామ పెద్దల సమక్షంలో వివాహం జరిపించారని, అప్పటి నుంచి వెంకటేష్‌పై కక్ష పెంచుకున్నట్లు నిందితుడు తెలిపాడు.

అదేవిధంగా ఇటీవల మొబైల్ ఫోన్ ధ్వంసం కావడం అంశంపై మృతుని కుటుంబంతో వివాదం నెలకొనగా, ఈ వివాదం 28న రాత్రి మరింత ముదిరిందని పోలీసులు తెలిపారు. బొక్కలగుట్టలోని చిప్పరి శ్రీనివాస్ ఇంటి సమీపంలో జరిగిన గొడవలో ఆవేశానికి లోనై సిమెంట్ రాయితో వెంకటేష్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ పరుష రమేష్, రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ తెలిపారు.