ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి
- యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు ఎండి సయ్యద్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణ కేంద్రంలోని జీహెచ్ఎస్ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎండి సయ్యద్ మాట్లాడుతూ, పాఠశాలలో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అలాగే విద్యార్థులకు కూర్చోవడానికి తగినన్ని బెంచీలు లేకపోవడంతో ఒకే బెంచిపై నలుగురు నుంచి ఐదుగురు వరకు కూర్చోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. త్రాగునీటి సౌకర్యం కూడా తగిన విధంగా లేదని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యా వాతావరణం సృష్టించాలని యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వే ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ నాయకులు శివ, మహేష్, అఖిల్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.
