ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను జిల్లా కలెక్టర్ డా.సత్య శారద మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.ఈ తనిఖీలో సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి ఎస్ కె ధర్మరాజ్ ,ఆయుర్వేదిక కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య,వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
