అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం

ఉట్నూర్, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) సర్వే ప్రధాన లక్ష్యమని ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్‌సింగ్ అన్నారు. మంగళవారం దంతన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ఎస్‌ఐఆర్ సర్వేను తహసీల్దార్ రఘునాథ్, ఉపసర్పంచ్ మహ్మద్ ముబీన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం బీఎల్‌వోలతో నిర్వహించిన సమావేశంలో సర్వే విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను ఎన్యూమరేషన్ ఫారాల్లో నమోదు చేయాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించి అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలు సమర్పించాలని, రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు కూడా సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.