పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జూన్ నెలలో పదవీ విరమణ పొందిన తొమ్మిది మంది పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీసు శాఖ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ (అడ్మిన్) ఎస్.ఆర్. రాజశేఖర రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్, అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్. షాను పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు, బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు మాట్లాడుతూ, దాదాపు 43 సంవత్సరాల పాటు నిబద్ధతతో పోలీసు శాఖకు సేవలందించిన అధికారుల కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం నిర్విరామంగా విధులు నిర్వహించిన వారి త్యాగం అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ మాట్లాడుతూ, పోలీసు సేవలు సవాళ్లతో కూడుకున్నవైనా వాటిని విజయవంతంగా నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు.
సమాజానికి అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్. షాను మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, సమాజం పట్ల బాధ్యతతో కూడిన సేవా యజ్ఞమని అన్నారు. పదవీ విరమణ పొందిన అధికారుల అనుభవం, క్రమశిక్షణ, సేవా తత్వం యువ పోలీసు సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ తమ అనుభవాలను సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని ఆకాంక్షించారు.

సన్మానానికి స్పందించిన పదవీ విరమణ పొందిన అధికారులు, తమ సేవలను గుర్తించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలకడం జీవితాంతం మరువలేని అనుభూతిగా నిలిచిపోతుందని జిల్లా పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, చిత్తూరు క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్, వీరేశ్, జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి నాగభూషణమ్మ, పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నెలలో సీసీఎస్, ఆర్మ్డ్ రిజర్వ్, వెదురుకుప్పం, కార్వేటినగరం, చిత్తూరు వన్‌టౌన్, తవణంపల్లి, రామకుప్పం పోలీస్ స్టేషన్లు, జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన మొత్తం తొమ్మిది మంది అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందారు.
