ఓటరు జాబితా సవరణలో అలసత్వం వద్దు: కలెక్టర్ సిరి

కర్నూలు, ఆంధ్రప్రభ: జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులు ప్రతి బీఎల్‌ఓకు చట్టబద్ధమైన బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని, ప్రజలను సచివాలయాలకు పిలిపించి పనులు చేయించరాదని స్పష్టం చేశారు.

కల్లూరు మండలంలో బీఎల్‌ఓల పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆలూరు, గూడూరు, ఆస్పరి మండలాల పనితీరును అభినందించిన ఆమె.. ఆదోని అర్బన్, మంత్రాలయం, కర్నూలు అర్బన్, కల్లూరు, హోళగుంద మండలాల్లో పురోగతిని మెరుగుపర్చాలని సూచించారు. పింఛన్ పంపిణీ, రేషన్ దుకాణాల ద్వారా కూడా ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని, అవసరమైన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.