18 గంటల్లో యాప్ సమస్య పరిష్కారం.. ఎమ్మెల్యే రాముకు అసోసియేషన్ కృతజ్ఞతలు
గుడివాడ, ఆంధ్రప్రభ: ట్రాక్టర్ ట్రైలర్లు, టూ వీలర్లు, ఫోర్ వీలర్ల తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వినియోగించే యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను 18 గంటల్లో పరిష్కరించడంపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ప్రజా వేదిక కార్యాలయంలో కృతజ్ఞతలు తెలిపారు. యాప్ పనిచేయకపోవడంతో వ్యవసాయ వాహనాల టెంపరరీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి రైతులు, ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎమ్మెల్యే జోక్యంతో ఉన్నతాధికారులు స్పందించి సేవలను పునరుద్ధరించారని వారు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఫోర్ వీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ సౌకర్యం గుడివాడలో ప్రారంభం కావడం హర్షణీయమన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడంలో పార్టీలు, వర్గాలు చూడనని, చిన్న తరహా పరిశ్రమలు గుడివాడ అభివృద్ధికి వెన్నెముకలాంటివని అన్నారు. వాటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం రామ్మోహనరావు, కార్యదర్శి చిన్నబాబు, కోశాధికారి నూగలాపు సురేష్, కోన శ్రీనివాస్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
