జనసేన పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానం

కోడూరు, ఆంధ్రప్రభ: జనసేన పార్టీలో వివిధ పదవులు, బాధ్యతలు ఆశించే ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు మర్రె గంగయ్య కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 9 గంటలకు అవనిగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

పార్టీలో ఆశిస్తున్న పదవిని స్పష్టంగా పేర్కొనడంతో పాటు, గతంలో పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు, ఇతర ఆధారాలను దరఖాస్తుతో జతచేయాలని సూచించారు. జనసైనికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా నూతన కమిటీల ఏర్పాటుకు సహకరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.