Nandi Awards | ఏపీలో షూటింగ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

Nandi Awards | ఏపీలో షూటింగ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

Nandi Awards | త్వరలో నంది అవార్డుల ప్రదానం..
సినీ రంగానికి శుభవార్త
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు

Nandi Awards | అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగు చలనచిత్రాలకు నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం త్వరలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస నాయక్ తెలిపారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 2012 నుంచి 2016 సంవత్సరాలకు సంబంధించిన సినిమా, టీవీ అవార్డులతో పాటు నేషనల్ అవార్డులను కూడా ప్రదానం చేస్తామని వివరించారు.

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఆంధ్రప్రభ ప్రతినిధికి వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే లక్ష్యంగా తమ సంస్థ అడుగులు వేస్తోందని శ్రీనివాస నాయక్ స్పష్టం చేశారు. ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అనుబంధ రంగాలను విస్తరించి, రాష్ట్రంలో మరిన్ని షూటింగ్లు జరిగేలా అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

త్వరలో నంది అవార్డులు

ఏపీలో షూటింగ్లు చేసుకునే చిన్న చిత్రాలకు ప్రభుత్వం రూ.10 లక్షల మేర ప్రోత్సాహకాలను అందజేస్తుందని, ఈ అవకాశాన్ని నిర్మాతలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ చిత్రాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఏపీలో రిజిస్టర్ చేసుకున్న సంస్థల్లోనే పూర్తిచేసుకునే విధంగా మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. ఈ చర్యతో అనుబంధ విభాగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాల్లో 8 డబ్బింగ్ థియేటర్లు ఉన్నాయని, వీటిలో పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయని వివరించారు.

ఏపీలో ఏడాదికి 70 సినిమాల చిత్రీకరణ

రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు అనువైన అద్భుతమైన లోకేషన్లు చాలా ఉన్నాయని శ్రీనివాస నాయక్ తెలిపారు. ఏడాదికి 70కి పైగా చిత్రాల షూటింగ్లు జరుగుతున్నాయని, వీటిలో ఇతర రాష్ట్రాల చిత్రాలు కూడా ఎక్కువగా ఉండడం విశేషం అన్నారు. తమిళ చిత్రాలు ఎక్కువగా తిరుపతి సమీప ప్రాంతాల్లో షూటింగ్లు చేసుకుంటున్నాయని, అలాగే మలయాళం, కన్నడ, ఒడియా, బెంగాలీ తదితర భాషా చిత్రాల చిత్రీకరణ పనులు కూడా ఏపీలో జరుగుతున్నాయని ఆయన వివరించారు.

ఏపీలో షూటింగ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మాతల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయడం లేదని, ఉచితంగానే అనుమతులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్లకు రూ.5 వేల ఫీజు వసూలు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. పెద్ద సినిమాల టికెట్ల రేట్లు పెంచుకునే సౌలభ్యం కూడా కల్పించామని చెప్పారు.

నంది అవార్డుల ప్రదానం

గతంలో ప్రకటించిన సినిమా, టీవీ నంది అవార్డులను ప్రదానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీఎం తెలిపారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు సంబంధించిన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, నేషనల్ అవార్డులను అందజేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. త్వరలోనే వీటిని ప్రదానం చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. వీటితో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు, బి.ఎన్.రెడ్డి అవార్డులను కూడా అందజేస్తామని తెలిపారు.

2013 నుంచి 2016 వరకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హేమమాలిని, కమల్ హాసన్, కె. రాఘవేంద్రరావు, రజనీకాంత్ ఎంపికయ్యారని చెప్పారు. అలాగే బి.ఎన్.రెడ్డి అవార్డులకు సింగీతం శ్రీనివాసరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఎస్.ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనులకు; నాగిరెడ్డి–చక్రపాణి అవార్డులకు దగ్గుబాటి సురేష్, దిల్ రాజు, ఆర్. నారాయణమూర్తి, ఎం.ఎం. కీరవాణి, కె.ఎస్. రామారావులకు; రఘుపతి వెంకయ్య అవార్డులకు కోడి రామకృష్ణ, వాణిశ్రీ, కృష్ణంరాజు, ఈశ్వర్, చిరంజీవిలకు ప్రకటించారని తెలిపారు. త్వరలోనే నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.