Andhra Pradesh Walking Tracks | ఏపీలో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌లు..

Andhra Pradesh Walking Tracks| ఏపీలో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌లు..

రోడ్ల మార్జిన్లలో ఆధునిక వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక

బీచ్‌లు, నదీ తీరాలు, హెరిటేజ్ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాక్‌లు

వాకర్ల కోసం ఎల్ఈడీ లైటింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, వ్యూ పాయింట్లు

ప్రజారోగ్యం, పర్యాటకాభివృద్ధికి కొత్త దిశగా ప్రభుత్వం అడుగులు

Andhra Pradesh Walking Tracks | అమరావతి, ఆంధ్రప్రభ : నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న కాలుష్యం, మారిన జీవనశైలి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రామీణ, మండల కేంద్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన పార్కులు, పర్యాటక ప్రాంతాలు, చెరువుల సుందరీకరణలో భాగంగా ఈ వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో, రాష్ట్రంలోని ప్రధాన బీచ్‌లు, నదీ తీరాలు, పులికాట్ సరస్సు వద్ద బర్డ్ వాకింగ్ ట్రాక్‌లు, కొండ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విశాఖపట్నం వంటి నగరాల్లో చారిత్రక కట్టడాలను కలుపుతూ ప్రత్యేకంగా హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి, పర్యాటకులకు, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

పట్టణాల్లో ఆక్సిజన్ స్థాయిని పెంచేందుకు అర్బన్ ఫారెస్ట్, పట్టణ ప్రకృతి వనాలను అభివృద్ధి చేసి, వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. కేవలం నడవడానికి మాత్రమే కాకుండా, వాకర్స్ కోసం ఎల్ఈడీ లైటింగ్, ఫ్లడ్ లైట్లు, వాటర్ ఫౌంటైన్లు, వ్యూపాయింట్లు, ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట

వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని స్థానికులు విరివిగా వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. పాదచారుల భద్రత, పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్ల మార్జిన్లలో వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. ప్రధాన రోడ్ల వెంట నడిచే వారికి ప్రత్యేక ట్రాక్‌లు లేకపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై జాగింగ్ లేదా వాకింగ్ చేయడం వల్ల వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం, ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తుంది.

ఈ నేపథ్యంలో రోడ్డుకు సురక్షితమైన దూరంలో గ్రీనరీతో కూడిన ట్రాక్‌లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులలో భాగంగా పార్కులు, ప్రత్యేక వాకింగ్ జోన్లను అభివృద్ధి చేయనున్నారు.

గ్రామీణ, సెమీ-అర్బన్ రహదారుల మార్జిన్లలో ఇంకా పూర్తి స్థాయిలో ట్రాక్‌లు అందుబాటులోకి రావాల్సి ఉంది.

పర్యాటక ప్రాంతాల వద్ద వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ప్రజల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లను నిర్మిస్తున్నారు. పర్యాటక రంగాలను అభివృద్ధి చేసే క్రమంలో సుందరమైన బీచ్‌లు, చారిత్రక ప్రదేశాల వద్ద ప్రత్యేక వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఉదాహరణకు, సూర్యలంక బీచ్, అఖండ గోదావరి తీరం, గండికోట వద్ద పర్యాటకులను ఆకర్షించేలా వ్యూ పాయింట్లతో పాటు ఈ ట్రాక్లు అందుబాటులోకి వస్తున్నాయి. చారిత్రక నగరమైన విశాఖపట్నంలో హెరిటేజ్ కట్టడాలను కలుపుతూ ప్రత్యేక రూట్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో 1.6 కిలోమీటర్ల మేర హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌ను జీవీఎంసీ అభివృద్ధి చేస్తోంది.

వన్యప్రాణి, పక్షి సంరక్షణ కేంద్రాలు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వాకర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. పులికాట్ సరస్సు వంటి కీలక ప్రాంతాల్లో బర్డ్ వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రకృతి వనాలు (అర్బన్ పార్కులు), రిజర్వాయర్ల వద్ద కూడా సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. పట్టణ ప్రకృతి వనాల చుట్టూ ఆక్సిజన్ అందేలా ప్రత్యేక వాకింగ్ ట్రాక్లను నిర్మిస్తున్నారు.