30thJunechintana | గ్రామ సంస్కృతికి శాశ్వత చిహ్నం

30thJunechintana | గ్రామ సంస్కృతికి శాశ్వత చిహ్నం

30thJunechintana | బొడ్రాయి ఆవిర్భావం.. గ్రామ రక్షణకు ప్రతీక
వాస్తు, ఆధ్యాత్మికత కలయికగా బొడ్రాయి విశిష్టత
గ్రామ సంప్రదాయాల్లో బొడ్రాయి పూజల ప్రాముఖ్యం

30thJunechintana | మన గ్రామీణ సంస్కృతిలో బొడ్రాయికి ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. బొడ్రాయి అసలు రూపం బొడ్డురాయి. సంస్కృతంలో దీనిని నాభిశిల అంటారు. మానవ శరీరానికి గర్భస్థ పిండదశ నుంచీ రక్షణ, పోషణ తల్లి యొక్క నాభి నుండి ఎలా లభిస్తాయో, గ్రామానికి రక్షణ, పోషణ, సమృద్ధులను ప్రసాదించే తల్లి గనుక ఆ శిలామాతను బొడ్డురాయి అన్నారు. శరీర మధ్యంలో నాభి అమరి ఉన్నట్లు గ్రామానికి మధ్యలో బొడ్రాయిని స్థాపిస్తారు.

గ్రామ నిర్మాణం జరుగుతున్న దశలో వాస్తు ప్రకారం పండితులను సంప్రదించి, నాలుగు దిక్కులలో గ్రామం ఎలా విస్తరించాలో, అలాగే వాస్తుశాస్త్ర నియమాలను బట్టి కొత్తగా ఏర్పడే గ్రామంలో అన్ని సౌకర్యాలు అంటే రహదారులు, కూడళ్లు, బావులు, చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ భూములు, వ్యాపార సముదాయాలు, స్మశానవాటిక మొదలైన అన్నింటికీ నిర్దిష్టమైన స్థలనిర్దేశం చేస్తారు. గ్రామ మధ్యంలో నాలుగు రహదారులు కలిసే చోట బొడ్రాయిని ఏ విధంగా ప్రతిష్ఠించాలో కూడా ప్రణాళిక వేసుకొనేవారు.

బొడ్రాయిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత అక్కడ నేలను త్రవ్వి, శంఖుస్థాపన చేసి, మొదట పరమేశ్వరుని అనుగ్రహ శక్తి అయిన శీతలాదేవి చక్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అందులో స్థాపిస్తారు. దాని పైన నాలుగు పలకలు కలిగిన చతురస్రాకారపు నిర్మాణాన్ని, దానిపైన ఎనిమిది పలకలు గల నిర్మాణాన్ని, ఆపై భాగాన లింగాకారం కలిగిన శిలను ప్రతిష్ఠిస్తారు. నాలుగు పలకల నిర్మాణం బ్రహ్మ స్వరూపమని, ఎనిమిది పలకల నిర్మాణం విష్ణు స్వరూపమని, ఆపైన ప్రతిష్ఠించిన లింగాకారపు శిలను శివ స్వరూపమని భావిస్తారు. ఇలా శీతలాదేవి యంత్రాన్ని స్త్రీ స్వరూపంగా, ఆపైన ఉన్న త్రిమూర్త్యాత్మకమైన బొడ్రాయిని పురుష స్వరూపంగా భావిస్తారు.

గ్రామానికి పొలిమేరలలో ఎనిమిది మంది అక్కమ్మ దేవతలు అనే స్త్రీ దేవతలకు సంబంధించిన యంత్రాలను కూడా స్థాపిస్తారు. అందువల్ల గ్రామానికి దుష్టశక్తులు, చెడు గ్రహాలు, ఆధి-వ్యాధుల పీడలు అంటవని విశ్వసిస్తారు. బొడ్రాయి గ్రామానికి ఆరుబయట ఉండే నిర్మాణం. దీనికి దేవాలయం లాంటి ఎలాంటి నిర్మాణం ఉండదు. గ్రామంలో అన్ని వర్ణాల వారూ స్వేచ్ఛగా పూజించుకొనే అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఏడాదికి కనీసం ఒకసారైనా బొడ్రాయికి పూజలు, తిరునాళ్లు జరిపిస్తూ సామూహిక వేడుకలు జరుపుకొంటారు.

నవవధువులు ఊరిలోకి అడుగు పెట్టినప్పుడు, అలాగే ఊరి నుండి తమ అత్తవారింటికి వెళ్లేటప్పుడు తప్పకుండా తొలుత బొడ్రాయికి నమస్కరించి, పసుపు, కుంకుమలు, పూలతో పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఇంటి ఆడపిల్లలకు వడిబియ్యం పెట్టినప్పుడు బొడ్రాయి వద్ద నమస్కరించి ఆశీస్సులు కోరే ఆచారం ఉంది.

రహదారుల విస్తరణ సమయంలో కానీ, లేదా కాలక్రమేణా బొడ్రాయి రహదారికంటే చాలా దిగువకు క్రుంగినప్పుడు కానీ, దానిని శాస్త్రోక్తంగా వెలికి తీసి పునఃప్రతిష్ఠ చేస్తారు. గ్రామం యొక్క వాస్తుపురుషుని నాభి స్థానమే బొడ్రాయి.

“వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్యాభిరత ప్రభో ।
మద్దేహ ధన ధాన్యాది సమృద్ధిం కురు సర్వదా॥”

నేల అనే శయ్య (పాన్పు)పై ఆశీనుడైన బొడ్రాయి రూప పురుషునికి, మా ఇంట నిత్యమూ ధన, ధాన్య సమృద్ధి ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ భక్తితో నమస్కరిస్తున్నాను అనే భావంతో ఈ శ్లోకాన్ని చదువుకొని బొడ్రాయిని ప్రార్థించుకోవాలన్నది పెద్దల మాట.

– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి