పెద్దపల్లి బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బైపాస్ రోడ్డు నిర్మాణానికి మొదట శిలాఫలకం వేసిన చోట కాకుండా మరోచోట సర్వే ఎలా చేస్తారని సోమవారం రైతులు అడ్డుకున్నారు. తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు పెద్దకల్వల నుండి అప్పన్నపేట వరకు నిర్మించాలను ప్రతిపాదించారు. స్థానిక ఎమ్యెల్యే విజయ రమణా రావు నిధులు మంజూరు చేయించి ఇటీవల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా వేరే చోట బైపాస్ రోడ్డు కోసం సర్వే చేసేందుకు సర్వే అధికారులు అక్కడికి సోమవారం వెళ్లారు.
అక్కడే ఉన్న పెద్దకల్వలకు చెందిన రైతులు సర్వే అధికారులను అడ్డుకుని నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పినా ససేమీరా అన్నారు. రాజీవ్ రహదారిపై వచ్చి ధర్నా చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మొదట ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా తమ భూములను సేకరించి బైపాస్ రోడ్డు వేయడం సరికాదని, తమకు తీరని అన్యాయం చేస్తున్నారని పలువురు రైతుకు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కుని బైపాస్ రోడ్డు నిర్మించాలనుకుంటే తమ శవాల మీదుగా వేసుకోవాలని రైతులు శాపనార్థాలు పెట్టారు.
