ఉరవకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఒకరు అక్కడికక్కడే మృతి
మరో నలుగురికి తీవ్ర గాయాలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ శివారు ప్రాంతంలోని గుంతకల్లు రోడ్డుపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరంలోని విద్యుత్ శాఖ డీపీ–ఈ సెక్షన్‌కు చెందిన అధికారులు, సిబ్బంది గుంతకల్లు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి కారులో అనంతపురానికి తిరిగి బయలుదేరారు.
ఉరవకొండ శివారు ప్రాంతానికి చేరుకోగానే వారి కారు ఎదురుగా వచ్చిన గూడ్స్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న జూనియర్ అసిస్టెంట్ నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడీఏ రాధిక, జూనియర్ అసిస్టెంట్ శివకుమార్, నూర్ మహమ్మద్, గూడ్స్ వాహనం డ్రైవర్ రాజు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
