ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో సగం గ్రామం చీకట్లో

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని అంద్‌గూడ గ్రామపంచాయతీలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో సగం ప్రాంతం మూడు రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టాలని లేదా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని గ్రామ సర్పంచ్ గారులే గంగాసాగర్ గుణాజీ విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రెండు మినీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, వాటిలో ఒకటి కాలిపోవడంతో గ్రామంలోని సగం ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, మూడు రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అంతేకాకుండా గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యుత్ తీగలు చాలా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని సర్పంచ్ పేర్కొన్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయడంతో పాటు, అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.