వర్షాల కోసం పాపహరేశ్వరునికి ప్రత్యేక పూజలు..

దిలావర్‌పూర్, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మాత అన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర ఆలయంలో సోమవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయంలో భాగంగా భక్తులు శివలింగానికి జలదిగ్బంధనం నిర్వహించారు. ఆలయ పరిసర గ్రామాల ప్రజలు శివలింగం చుట్టూ నీటిని నింపి, మరుసటి రోజు ఉదయం వరకు అలాగే ఉంచారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో బెల్లం పాయసం వండి, శివలింగానికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆ పాయసాన్ని చిన్నారులకు తినిపించే సంప్రదాయాన్ని నిర్వహించారు. ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక పూజలను ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.