వర్షాల కోసం ప్రత్యేక పూజలు..
- ఏరువాక పౌర్ణమి సందర్భంగా గ్రామదేవతలకు వరద పాశం మహోత్సవం
- సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు
శంకరపట్నం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కన్నాపూర్, ధర్మారం గ్రామాల్లో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా వరద పాశం మహోత్సవం నిర్వహించారు.
గ్రామదేవతలైన మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ, ఎల్లమ్మతో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, వరద పాశం కార్యక్రమాలు నిర్వహించి, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటలు బాగా పండించి సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా కన్నాపూర్ గ్రామ సర్పంచ్ రమా శ్రీనివాస్ మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రకృతి అనుకూలించి మంచి వర్షాలు కురవాలని గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ చింతిరెడ్డి పద్మ, మాజీ సర్పంచులు తాటికొండ సదానందాచారి, కాటం వెంకటరమణారెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
