మామిడికి మద్దతు ధర అమలు చేయాలి
జాయింట్ కలెక్టర్‌కు మామిడి రైతు సంఘం వినతి
చిత్తూరు, ఆంధ్రప్రభ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మామిడి రైతు సంఘం నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన ర్యాంపుల వద్ద గత వారం వరకు తోతాపురి మామిడికి కిలోకు రూ.4 చెల్లించగా, గత మూడు రోజులుగా రూ.3 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.
దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలోని సుమారు 40 వేల మంది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 సీజన్‌కు ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు రూ.7.50 ధర ప్రకటించినప్పటికీ, జిల్లాలోని ఏ గుజ్జు పరిశ్రమ కూడా ఆ ధరను అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు కిలోకు రూ.6 చెల్లిస్తామని ధరల పట్టికలు ప్రదర్శించిన పరిశ్రమలు, గత మూడు రోజులుగా వాటిని తొలగించి రూ.5 మాత్రమే చెల్లిస్తున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశాయని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయని గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా స్థాయిలో అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు కోరినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. వెంటనే కమిటీలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలాగే గత ఏడాది గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక మామిడి బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టపోతున్న రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరారు. మామిడి పంటను కూడా పంటల బీమా పథకంలో చేర్చి బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
ర్యాంపుల్లో కూడా గుజ్జు పరిశ్రమలు చెల్లించే ధరనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్దతు ధర అమలు చేయని ర్యాంపులు, గుజ్జు పరిశ్రమలపై చర్యలు తీసుకుని జిల్లాలోని 40 వేల మందికి పైగా మామిడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉమాపతి నాయుడు, మునిరత్నం నాయుడు, హేమలత, చంగల్రాయిరెడ్డి, జయదేవయ్యతో పాటు పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
