ఏరువాకతో రైతన్నకు కొత్త ఉత్సాహం

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
వీరులపాడు మండలం తాటిగుమ్మిలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఉమా

వీరులపాడు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం తాటిగుమ్మిలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులు, రైతులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు, ప్రకృతికి, వ్యవసాయానికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చాటిచెప్పే పవిత్ర పర్వదినమే ఏరువాక పౌర్ణమి అన్నారు. భూమిని తల్లిగా భావించి, నాగలిని పూజించి, ఎద్దులను అలంకరించి, వర్షాలను ఆశీర్వాదంగా భావిస్తూ కొత్త సాగుకు శ్రీకారం చుట్టే ఈ పండుగ రైతు ఆశలకు, కొత్త పంటల ప్రారంభానికి ప్రతీక అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు ఏరువాక సాగి వ్యవసాయ పనులను ప్రారంభిస్తున్న ఈ శుభ సందర్భంగా ప్రతి చినుకు ఆశీర్వాదంగా మారి, ప్రతి విత్తనం బంగారు పంటగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుఖసంతోషాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. అన్నదాత చెమట చుక్కలతో పండే ప్రతి గింజ దేశానికి బంగారు భవిష్యత్తును అందిస్తుందని, రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు.

విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు అన్ని విధాలుగా అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే రూ.3,500 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రాజెక్టు పూర్తై గోదావరి జలాలు సాగర్ కాలువలకు చేరితే ఈ ప్రాంతం సస్యశ్యామలమై లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలను సంరక్షించుకోవాలని రైతులకు సూచించారు.