పాత్రికేయుల పిల్లలకు ఫీజుల్లో గరిష్ఠ రాయితీ

  • ప్రైవేట్ పాఠశాలలకు డీఈఓ రాజేందర్ ఆదేశాలు

భూపాలపల్లి , ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు గరిష్ఠ స్థాయిలో(50 శాతం) ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్స్ (టీఎస్‌జేయూ) జిల్లా శాఖ, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖలు చేసిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈఓ వెల్లడించారు.

జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో జర్నలిస్టుల పిల్లలకు గరిష్ఠ ఫీజు రాయితీ కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత మండల విద్యాధికారుల (ఎంఈఓలు) ద్వారా అన్ని ప్రైవేట్ పాఠశాలలకు సూచనలు జారీ చేశారు.

డీఈఓ జారీ చేసిన ఈ ఉత్తర్వులను జిల్లాలోని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు స్వాగతిస్తూ, పాత్రికేయ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ , జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.