మహిళా సంఘాలకు రూ.172 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులు
చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆవుల మాధవి సుందర్ తెలిపారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ సమక్షంలో నీలగిరి జిల్లా మహిళా సంఘాలకు మంజూరైన రూ.172 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కును మహిళా సంఘాల తరఫున అందుకున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆవుల మాధవి సుందర్ మాట్లాడుతూ, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగుపడి, స్వయం ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు జిల్లా మహిళా సంఘాల తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
