బైపాస్ నిర్మాణంతో రైతులకు అన్యాయం: రైతు సంఘాలు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామం వద్ద నిర్మిస్తున్న బైపాస్ రహదారి వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆరోపించారు.

సోమవారం బైపాస్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు చేపట్టిన ఆందోళన దీక్షా శిబిరాన్ని సందర్శించి వారు మద్దతు తెలిపారు. గతంలో శంకుస్థాపన చేసిన స్థలాన్ని మార్చి రహదారిని సుమారు 600 మీటర్లు పొడిగించడం వల్ల 15 ఎకరాల వ్యవసాయ భూమిని రైతులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోరేపు మల్లేష్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ యాదవ్, టీఆర్పీ నాయకుడు గుండవేణి స్వామి, రైతు కూలీ సంఘం నాయకుడు కె. రాజు తదితరులు పాల్గొన్నారు.