ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి..
- నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- రౌడీ, సస్పెక్ట్, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా
- వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి
- ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
- నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి ఎలాంటి భేదభావం లేకుండా పారదర్శకంగా, మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్ఐ రమేష్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్, యూనిఫాం టర్నౌట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. ఫిర్యాదుల నమోదును, సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల నమోదు, నిర్వహణను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.
రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా ఉంచి, నేర నియంత్రణ, కేసుల సత్వర పరిష్కారం, ప్రజలతో సత్సంబంధాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని, డయల్-100 సేవలకు వేగంగా స్పందించాలని ఎస్పీ ఆదేశించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
దొంగతనాల నివారణకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామాలు, కాలనీల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్ఐ రమేష్, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
