అసైన్మెంట్ భూముల్లో ప్లాట్లు కొనొద్దు

అక్రమ లావాదేవీలతో మోసపోయే ప్రమాదం.. ప్రజలకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరిక

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : ముదిగుబ్బ మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అసైన్మెంట్ భూములను అక్రమంగా ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్న ఘటనలు అధికారుల దృష్టికి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. ఇటువంటి భూములను కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

అసైన్మెంట్ భూములను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదలాయింపు చేయడానికి లేదా విక్రయించడానికి అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాంటి భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించినా వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగవని తెలిపారు. దీంతో ఇటువంటి లావాదేవీల్లో పాల్గొనే వారు ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.

ప్రజలు భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి, భూమి స్వభావం, యాజమాన్య హక్కులు, రెవెన్యూ రికార్డులు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అసైన్మెంట్ భూములను అక్రమంగా విక్రయించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై రెవెన్యూ శాఖ నిరంతరం నిఘా ఉంచుతోందని తెలిపారు. అనుమానాస్పద భూ లావాదేవీలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.