విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ..

భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలంలోని గోన్ గొప్పుల గ్రామ ప్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ స్వామి హాజరుకాగా, గ్రామ సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చరణ్ గౌడ్ మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించాలని ఆకాంక్షించారు.
ఎంఈఓ స్వామి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై, అందించిన పుస్తకాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల శ్రేయోభిలాషులు భోజ గౌడ్, ఎస్‌ఆర్ భూమేశ్వర్, గట్టు భూమేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు అరుణ్, ఇతర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.