బొక్కలగుట్టలో దారుణం..

  • సిమెంట్ బస్తాతో దాడి.. వ్యక్తి మృతి

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట ప్రాంతంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గజ్జి వెంకటేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

స్థానికుల కథనం ప్రకారం, అదే ప్రాంతానికి చెందిన ఒడ్డేపల్లి రాజ్‌కుమార్ గడ్డకట్టిన సిమెంట్ బస్తాను వెంకటేష్‌పై విసరడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం.

మృతుడు వెంకటేష్, నిందితుడు రాజ్‌కుమార్ మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ పరమైన విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.