AI in Andhra Pradesh | గూగుల్‌తో ఏపీకి డిజిటల్ భాగస్వామ్యం

AI in Andhra Pradesh | గూగుల్‌తో ఏపీకి డిజిటల్ భాగస్వామ్యం

AI in Andhra Pradesh | ప్రతి విశ్వవిద్యాలయంలో ఏఐ కేంద్రాల ఏర్పాటు
లాజిస్టిక్స్ రంగంలో భారీ ప్రణాళిక
అమరావతిలో ఎన్యూఎస్ అంతర్జాతీయ క్యాంపస్
ఏఐ, క్వాంటమ్ వ్యాలీతో డిజిటల్ భవిష్యత్తు

AI in Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేపట్టిన సింగపూర్ పర్యటన కీలక ఫలితాలను ఇస్తోంది. ప్రపంచ దిగ్గజ సాంకేతిక సంస్థ గూగుల్‌తో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరించడం రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తుకు కీలక మలుపుగా భావిస్తున్నారు.

ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడమే కాకుండా, యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా గూగుల్ భాగస్వామ్యం కీలకంగా మారనుంది. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు క్లౌడ్ టెక్నాలజీల వినియోగాన్ని విస్తరించాలని సీఎం గూగుల్ ఆసియా-పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో చర్చించారు. ఈ కారణంగా ప్రభుత్వ శాఖల మధ్య సమాచార సమన్వయం, సేవల వేగం, డేటా భద్రత, ప్రజలకు డిజిటల్ సేవల విస్తరణలో గూగుల్ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నారు.

రాష్ట్ర యువతకు ప్రపంచ ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్, డిజిటల్ నైపుణ్యాలపై గూగుల్‌తో సంయుక్త శిక్షణా కార్యక్రమాలను విస్తరించాలని ప్రతిపాదించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నప్పుడే అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్లు పొందేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీంతో రాష్ట్ర యువతకు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రతి విశ్వవిద్యాలయంలో ఏఐ కేంద్రాలు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు గూగుల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కేంద్రాల ద్వారా పరిశోధనలు, స్టార్టప్ ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ, అధ్యాపకులకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం వంటి నగరాలను ఏఐ ఇన్నోవేషన్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఇది బలాన్నిస్తుంది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సంజీవని ఆరోగ్య ప్రాజెక్టులో గూగుల్ భాగస్వామ్యం కానుంది. కృత్రిమ మేధ ఆధారిత వ్యాధుల గుర్తింపు, డిజిటల్ హెల్త్ రికార్డులు, టెలీమెడిసిన్, గ్రామీణ ప్రాంతాలకు నిపుణుల వైద్య సేవల విస్తరణ, ఆసుపత్రుల మధ్య సమన్వయం వంటి అంశాల్లో సాంకేతిక సహకారం అందించనున్నారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

లాజిస్టిక్స్ రంగంలో భారీ ప్రణాళిక

సింగపూర్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ వైసీహెచ్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం జరిపిన చర్చల ఫలితంగా రాష్ట్రంలో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ గిడ్డంగులు, ఆటోమేటెడ్ సప్లై చైన్ వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రాన్ని దక్షిణ భారత లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.

వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను తక్కువ వ్యయంతో దేశ, విదేశాలకు తరలించేలా సరఫరా వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యానవన, మత్స్య, ఆక్వా రంగాలకు ప్రపంచ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఎగుమతుల వ్యయాన్ని తగ్గించేందుకు ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థలు అత్యంత అవసరం. పోర్టులు, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌లను అనుసంధానిస్తూ అంతర్జాతీయ ప్రమాణాల సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.

అమరావతిలో ఎన్యూఎస్ క్యాంపస్

ప్రపంచ ప్రఖ్యాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్యూఎస్) అధ్యక్షుడు టాన్ ఎంగ్ చైతో సీఎం సమావేశం కారణంగా అమరావతిలో అంతర్జాతీయ క్యాంపస్ లేదా శాటిలైట్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించాయి. భవిష్యత్తులో అమరావతిని ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం.

అమరావతిలో ప్రతిపాదించిన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు ఎన్యూఎస్ సాంకేతిక సహకారం అందనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక పరిశోధనల కోసం అంతర్జాతీయ ప్రమాణాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ప్రపంచ స్థాయి పరిశోధకులు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు అమరావతికి వచ్చే అవకాశాలు ఉంటాయి.

రాష్ట్ర రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా నగరంగా కాకుండా విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, హైటెక్ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలను వేగవంతం చేసింది.