రాయపర్తి పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట్ ఏసీపీ

రాయపర్తి పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వర్ధన్నపేట్ ఏసీపీ

  • కిట్ ఇన్‌స్పెక్షన్ నుంచి క్రైమ్ కంట్రోల్ వరకు క్షుణ్ణంగా పరిశీలన
  • రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపండి
  • ఏసీపీ అంబటి నర్సయ్య

రాయపర్తి, ఆంధ్రప్రభ : పోలీస్ స్టేషన్ అంటేనే శాంతిభద్రతలకు నిలయం. దాని పని తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు వర్ధన్నపేట్ ఏసీపీ అంబటి నర్సయ్య ఆకస్మికంగా రాయపర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేపట్టారు. పోలీస్ సంప్రదాయాలకు అనుగుణంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, పరేడ్ నిర్వహించి ప్రతి ఒక్కరి కిట్‌ను నిశితంగా పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందిని వరుస క్రమంలో నిలబెట్టి, ఒక్కొక్కరి యూనిఫాం, బూట్లు, బెల్ట్, క్యాప్, ఐడెంటిటీ కార్డు, వారి వద్ద ఉన్న లాఠీ, హ్యాండ్‌కఫ్స్, బాడీ వోర్న్ కెమెరాలను ఏసీపీ స్వయంగా తనిఖీ చేశారు. ఖాకీ యూనిఫాం అంటే గౌరవం. దాన్ని ఎల్లప్పుడూ నీట్‌గా, నిబంధనల ప్రకారం ధరించాలని సూచించారు. అనంతరం స్టేషన్ రైటర్ రూమ్‌లోకి వెళ్లి జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ బుక్, పెట్టీ కేస్ రిజిస్టర్, స్టేషన్ ప్రాపర్టీ రిజిస్టర్, బీట్ బుక్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఏసీపీ అంబటి నర్సయ్య కీలక దిశానిర్దేశం చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలు నిరోధించడమే మన ప్రధాన ధ్యేయం కావాలి. ప్రజలకు 24×7 అందుబాటులో ఉండాలని, ఎటువంటి అసాంఘిక చర్యలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా గట్టి నిఘా ఉంచాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఏ మాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, బీసీ/డీసీ లిస్టును ఏసీపీ స్వయంగా తనిఖీ చేశారు. లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిపై నిరంతర నిఘా ఉంచాలని, వారి కదలికలను బీట్ కానిస్టేబుళ్లు, బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, పాత నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడకుండా కట్టడి చేయాలి. ప్రివెంటివ్ అరెస్టులు, బైండోవర్ కేసులు చేయడానికి వెనుకాడవద్దని ఆదేశించారు.

నేరాలను అరికట్టడంలో సాంకేతికత మనకు పెద్ద ఆయుధమని ఏసీపీ పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కూడలి, ప్రతి షాపు, ప్రతి ముఖ్య ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యేలా గ్రామస్తులను చైతన్యపరచండి. ‘థర్డ్ ఐ’ నిఘాలో నేరస్థులు భయపడతారని సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని ఏసీపీ ఆదేశించారు. ప్రతి ఎఫ్‌ఐఆర్, ప్రతి అరెస్టు, ప్రతి సీజర్ వెంటనే CCTNS అప్లికేషన్‌లో నమోదు కావాలి.

ఈ-పెట్టీ కేసులు, ఈ-చలాన్ కేసులు పెండింగ్ లేకుండా చూడాలి. నేరస్థలంలో లభించే ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ సేకరణలో నైపుణ్యం పెంచుకోవాలి. సీసీ ఫుటేజీ విశ్లేషణ, కాల్ డేటా ఎనాలసిస్, టవర్ డంప్ టెక్నిక్‌లను దర్యాప్తులో వాడండని దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి పట్ల మర్యాదపూర్వకంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఏసీపీ సూచించారు. బాధితులకు న్యాయం చేయడమే మన విధి అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వర్ధన్నపేట్ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమ్మూరి శ్రీనివాస రావు, రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.