Plastic Roads | ప్లాస్టిక్ రోడ్లతో కొత్త విప్లవం

Plastic Roads | ప్లాస్టిక్ రోడ్లతో కొత్త విప్లవం

Plastic Roads | ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వ దృష్టి
తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక
ప్లాస్టిక్ వ్యర్థాలకు కొత్త జీవితం
కావలిలో ప్రారంభమైన ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం
ప్లాస్టిక్-తారు మిశ్రమంతో రోడ్లు ఎలా నిర్మిస్తారు?

Plastic Roads | అమరావతి, ఆంధ్రప్రభ: పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి, అత్యంత మన్నికైన రోడ్లను నిర్మించే సరికొత్త సాంకేతికతపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఈ రహదారులకు భవిష్యత్తులో మంచి ఆదరణ దక్కుతుందని అభిప్రాయపడుతోంది.

ఈ పద్ధతిలో తారుతో పాటు ముక్కలు చేసిన ప్లాస్టిక్‌ను కరిగించి రోడ్లు వేయడం ద్వారా నిర్మాణ వ్యయం తగ్గడమే కాక, రోడ్ల జీవితకాలం, మన్నిక పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రోడ్ల నిర్మాణం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా ఒక కిలోమీటరు తారు రోడ్డు వేయడానికి 10 టన్నుల తారు అవసరమవుతుంది. అయితే ప్లాస్టిక్ రోడ్డు నిర్మాణంలో 9 టన్నుల తారు, 1 టన్ను ప్లాస్టిక్ మిశ్రమాన్ని వాడితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కిలోమీటరుకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది.

ఈ రోడ్లపై వర్షపు నీరు నిలవదు. గుంతలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ రోడ్ల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువకాలం బలమైన నాణ్యతా ప్రమాణాలతో ఉంటాయి. భూమిలో కరిగిపోని క్యారీ బ్యాగులు, వాటర్ బాటిల్స్ వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో భారత్ పెట్రోలియం అభివృద్ధి చేసిన జియోసెల్ టెక్నాలజీ ద్వారా రీసైకిల్ చేయడానికి కష్టమైన బహుళ-లేయర్డ్ ప్లాస్టిక్‌ను కూడా రోడ్ల నిర్మాణంలో వాడవచ్చు. కావలి పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి, అందులోని పొడి ప్లాస్టిక్‌ను యంత్రాల సాయంతో ముక్కలుగా చేసి రోడ్డు నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు.

కావలిలోని పాత యార్డు, తుమ్మలపెంట యార్డుల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్త నుంచి ప్లాస్టిక్ కవర్లు, సీసాలు తదితర వ్యర్థాలను వేరు చేశారు. తమిళనాడుకు చెందిన జిగ్మా కంపెనీ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

ముక్కలు చేయడం..

వేరు చేసిన పొడి ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిషన్లలో ప్రాసెస్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని సుమారు 165 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తారు, కంకరను వేడి చేసి, అందులో దాదాపు 6-8 శాతం ముక్కలు చేసిన ప్లాస్టిక్‌ను కలుపుతారు.

రహదారి పరచడం..

ఈ విధంగా ప్లాస్టిక్-తారు మిశ్రమంతో కూడిన వేడి మిశ్రమాన్ని రోడ్డుపై వేసి, రోలర్ల ద్వారా చదును చేస్తారు. ఈ ప్లాస్టిక్-తారు రోడ్లు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.