Public Sector Oil Companies | వరదలు, కోవిడ్, యుద్ధాల్లోనూ నిరంతర ఇంధన సరఫరా
Public Sector Oil Companies | వరదలు, కోవిడ్, యుద్ధాల్లోనూ నిరంతర ఇంధన సరఫరా
Public Sector Oil Companies | సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల సేవలు
ప్రైవేటీకరణ ప్రయత్నాలకు చెక్ పడిన కారణాలివే
ప్రభుత్వ రంగ సంస్థలు భరించిన వేల కోట్ల నష్టాలు
ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య తేడా
Public Sector Oil Companies | న్యూఢిల్లీ: భారత్ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎదురొడ్డి నిలిచాయి. అవి వినాశకరమైన వరదలైనా, శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి అయినా, ప్రపంచ చమురు సరఫరాలకు ముప్పు తెచ్చిన పశ్చిమాసియా యుద్ధమైనా దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ కర్తవ్యాన్ని మరింత పట్టుదలగా కొనసాగించాయి. ఇంధన సరఫరాలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నా, వినియోగదారులపై భారం మోపకూడదన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వేల కోట్ల నష్టాలను భరించాయి.
దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) తక్కువ రాబడులు, ఇంధన ధరల నిర్ణయంలో ప్రభుత్వ జోక్యం, భారీ కార్యకలాపాల కారణంగా తరచుగా విమర్శలను ఎదుర్కొన్నాయి. వీటిని ప్రైవేటీకరణ కోసం రెండు సార్లు అమ్మకానికి పెట్టారు. 2002లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) అమ్మే ప్రణాళికలు వేగవంతమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ప్రయత్నాలు నిలిచిపోయాయి. తిరిగి 2020లో కూడా ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను ప్రైవేటీకరణ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసింది. తగినన్ని బిడ్లు రాకపోవడంతో ఈ ప్రయత్నాలను అప్పటికి విరమించుకున్నారు.
ఒక రకంగా ప్రతి సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ఆ మాటకొస్తే దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా, ప్రజల ప్రయోజనాల కోసమే నిటారుగా నిలబడ్డాయి. దీని వల్ల వీటిని ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ పెద్దలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
దేశ ఇంధన జీవనాధారాన్ని నియంత్రించే కంపెనీలపై ప్రభుత్వాలు తమ పట్టును సడలించడానికి ఎందుకు వెనుకాడతాయో ప్రతి జాతీయ అత్యవసర పరిస్థితి మరోసారి స్పష్టం చేసిందని విశ్లేషకులు, పరిశ్రమ అధికారులు తెలిపారు.
2015లో భారీగా వచ్చిన వరదలు చెన్నై నగరాన్ని ముంచెత్తిన సమయంలో రోడ్లు నీటమునిగిపోయాయి. షాపులు మూతపడ్డాయి. అయినప్పటికీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని తరలించాయి. నీటమునిగిన డిపోలను పునరుద్ధరించడానికి, అత్యవసర సేవలకు సరఫరాలను కొనసాగించడానికి తీవ్రంగా ప్రయత్నించాయి.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేశాయి. అత్యవసర వాహనాలకు ఇంధనాన్ని సమకూర్చాయి. పరిమిత సిబ్బందితో రిఫైనరీలు పని చేశాయి. కఠినమైన రాకపోకల ఆంక్షల మధ్య లక్షలాది కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేశాయి. నిరంతర ఉత్పత్తిని నిర్ధారించడానికి రిఫైనరీల లోపలే ఆపరేటింగ్ బృందాలను వేరుగా ఉంచారు. బయట ట్యాంకర్ డ్రైవర్లు, ఎల్పీజీ డెలివరీ సిబ్బంది కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లలో కూడా సేవలు అందించారు.
తాజాగా పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పాయి. ఇరాన్-అమెరికా యుద్ధ సమయంలో ప్రభుత్వ రంగ రిఫైనరీలు తమ కార్యకలాపాలను వేగంగా పునర్వ్యవస్థీకరించుకున్నాయి. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాయి. ముడి చమురును ఇతర ప్రాంతాల నుంచి సేకరించాయి. రిఫైనరీలను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించాయి. కొరత రాకుండా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలను సమన్వయం చేశాయి. ఫలితంగా ఇంధన కొరత లేకుండా సరఫరాలు జరిగాయి.
రెండున్నర నెలల పాటు అంతర్జాతీయ చమురు ధరల్లో 50 శాతానికి పైగా పెరుగుదలను తట్టుకుని నిలబడ్డాయి. వినియోగదారులపై అతి తక్కువగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.7.50, ఎల్పీజీ సిలిండర్‌పై రూ.89, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మాత్రమే పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరలతో పోల్చితే ఇవి చాలా స్వల్పమే.
క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం మార్చి, మే నెలల మధ్య మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.40 వేల నుంచి రూ.45 వేల కోట్ల నికర నష్టాలను ఎదుర్కొన్నాయి. అదే సమయంలో దేశంలోని ప్రైవేట్ రంగ చమురు సంస్థలు యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకే పూర్తి స్థాయి ఖర్చులను వెంటనే వినియోగదారులపై మోపాయి. ప్రైవేట్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. కోవిడ్ సమయంలో అన్ని ప్రైవేట్ ఇంధన సంస్థలు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టాయి.
అన్ని సంక్షోభ సమయాల్లో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే దేశ, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్ని నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా అండగా ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు ముఖం చాటేశాయని ఈ రంగంలోని ప్రముఖులు స్పష్టం చేశారు. సంక్షోభాల సమయంలో ఇవి పోషించిన పాత్ర వాటి ప్రాముఖ్యతను మరింత గట్టిగా చెప్పిందని, దీని వల్లే ఇవి ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి ప్రస్తుతానికి తప్పించుకున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
