తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం.. నితిన్ నబీన్ పిలుపు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమ్మేళన్’ లో బీజేపీ శ్రేణులకు ఆయన కీలక సందేశం ఇచ్చారు. ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు.
రాబోయే రోజుల్లో భాగ్యనగర్ రాజకీయాల్లో బీజేపీ మరింత బలంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలం కేవలం అగ్రనేతల్లో కాకుండా బూత్ స్థాయి కార్యకర్తల్లోనే ఉందని నితిన్ నబీన్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తల కృషి వల్లే పార్టీ బలపడిందని పేర్కొంటూ, అదే విధంగా తెలంగాణలో కూడా ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ నగర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషించే దిశగా పనిచేయాలని ఆయన కోరారు.
తెలంగాణలో పార్టీ విస్తరణకు ఇదే సరైన సమయమని, బూత్ స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి పెట్టాలని నాయకత్వానికి సూచించారు. కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతో భాగ్యనగర్‌లో బీజేపీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


