బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ధ్వజం

  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ 30 నెలల పాలనకు బహిరంగ చర్చకు సిద్ధం
  • ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నిఘంటువులో త్యాగం అంటే కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడితే, ఆ ఘనతను బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

ఆదివారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వందేళ్లకు సరిపడా విధ్వంసం జరిగిందని ఆరోపించిన సీఎం, ప్రస్తుతం అధికారం కోల్పోయిన అక్కసుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్రంపై విషం చిమ్ముతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల పాలనకు మధ్య బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇందుకు స్పీకర్‌కు లేఖ రాసి, ఇరు పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలపై శాసనసభలోనే ముఖాముఖి చర్చ నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందని పేర్కొన్న రేవంత్, గత 30 నెలల్లో పేదల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్ తినే బియ్యమే తండాల్లోని పేదలు కూడా తింటున్నారని అన్నారు. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబానికి మరోసారి అధికారాన్ని అప్పగించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని సీఎం స్పష్టం చేశారు. అసలైన త్యాగం అంటే 1969 తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ, మలిదశ ఉద్యమంలో పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నాయకులను గుర్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది చేసిన త్యాగాలను బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుందని ఆరోపించారు.

‘మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం’

మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా మూసీ ప్రక్షాళన చేపడతామని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్-1గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, డిండి, నక్కలగండి ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కనీసం 10 కిలోమీటర్లు కూడా తవ్వలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి, పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు.